UPDATED 28th MARCH 2022 MONDAY 01:40 PM
Tirumala : తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. శ్రీగంధం వనం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ఏనుగులు ధ్వంసం చేసాయి. ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి ,ఇతర ఫారెస్ట్ అధికారులు ఈరోజు పరిశీలించారు.
ఏనుగుల కారణంగా వాహన చోదకులకు, భక్తులకు అపాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ తెలిపారు. ఏనుగులు తిరుమల అడవుల్లో సంచరించడం సర్వసాధారణమే అని… తిరుమల శేషాచలం అడవుల్లో ఏనుగుల సంచారం కొత్తేమీ కాదని ఆయన వివరించారు. లాక్ డౌన్ కారణంగా వాహనాల రణగొణ ధ్వనులు తగ్గడంతో ఏనుగులు రోడ్ల సమీపంలోకి రావడం జరిగిందని ఆయన చెప్పారు.
కొంత సమయం తర్వాత ఏనుగులు వాటంతట అవే తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతాయని…వాటి కారణంగా ఎవరికీ ఎటువంటి హాని జరగదని శ్రీనివాసులు రెడ్డి ధైర్యం చెప్పారు. ఇటీవల మొదటి ఘాట్ రోడ్ లోని ఏడో మైలు ప్రాంతంలో ఏనుగుల సంచరించాయని.. తాజాగా పార్వేటి మండపం వద్ద ఏనుగులు సంచరించడం జరిగిందని డీఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి అన్నారు.