UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 09:10 PM
విజయనగరం (రెడ్ బీ న్యూస్): నిబంధనలకు విరుద్ధంగా రామతీర్థం పాలకమండలి ప్రమాణస్వీకారం చేయించారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఈవోపై ఆయన నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేకి ఏ అధికారం ఉందని ప్రమాణ స్వీకారం చేయించారు…? అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. ఇంత దారుణంగా రాజ్యాంగాన్ని అవమానిస్తారా? అని ధ్వజమెత్తారు.
ఈవో నిబంధనలు పాటించడం లేదని ఆయన సీరియస్ అయ్యారు. ఇదేంటి అని అడిగిన నా మీద రాజకీయం చేస్తున్నారు, బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా నడుచుకోండి అని అడగడం రాజకీయమా? అని నిలదీశారు. ఎమ్మెల్యే విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని అశోక్ గజపతి రాజు అన్నారు. పాలకమండలితో కలిసి పని చేయాల్సిన నన్నే పక్కన పెట్టడం దారుణం అని వాపోయారు. మతాలను అవమానించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు నేను లేఖలు రాసినా ఇంతవరకు ఒక్క జవాబు రాలేదన్నారు. మా పూర్వీకులు గుడి కట్టింది ప్రజల కోసం, దాంతో రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదని అశోక్ స్పష్టం చేశారు. దేవుడి విగ్రహాలకి డబ్బులు ఇస్తే తీసుకోకుండా నా మొహం మీద కొట్టిన ఈ ప్రభుత్వ పెద్దలు, నేను రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ పిట్టకథలు చెబుతున్నారని మండిపడ్డారు.