పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో గోదావరి జలాలు

UPDATED 8th NOVEMBER 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో గోదావరి జలాలను అందించడానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక 23వ వార్డులో నగరదర్శిని కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామా రైస్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ గోదావరి జలాలు పట్టణంలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందించడానికి కొత్త పైపులైన్లు, అలాగే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గంలో రూ.1000 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. సుమారు రూ.45 కోట్లుతో సామర్లకోట నుంచి పెద్దాపురం ఎడిబి రోడ్డు విస్తరణ, వీటిలో రూ. మూడు కోట్లుతో సెంటర్ లైటింగ్, రూ.రెండు కోట్లుతో ఫుట్ పాత్, డివైడర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.250 కోట్లుతో రాజానగరం నుంచి సామర్లకోట వరకు డబుల్ లైన్ రోడ్డు, అలాగే పట్టణ పరిధిలోని వార్డుల్లో సిసి రోడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందరికీ ఇళ్ళు పథకం ద్వారా రూ.100 కోట్లుతో నియోజకవర్గంలో గృహ నిర్మాణం చేపట్టామని, 1000 వ్యక్తిగత ఇళ్ళు నిర్మాణానికి మంజూరు కాగా, వీటిలో 600 మందికి ఇళ్ళు మంజూరు చేశామని, ఇంకా 400 మంది ఉన్నారని తెలిపారు. అర్హత గల ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు అందచేశామని, ఇంకా అవసరమున్నవారికి అందచేస్తున్నామని, పట్టణంలో చెఱువులను అహ్లాదకరంగా మార్చి పార్కులుగా తయారు చేస్తున్నామని చెప్పారు. పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి, శతాబ్దిపార్కులకు రాష్ట్రంలో ప్రధమస్థానం వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందించడానికి ప్రస్తుతం ఉన్న 5 ఎం.ఎల్.డికి మరో 7 ఎం.ఎల్.డిని జతచేసి పూర్తిస్థాయిలో 2050 వరకు నీరు ప్రజలకు అందేలా మంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, ఉల్లి మంగ, మున్సిపల్ కమీషనర్ శేషాద్రి, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, వార్డు కౌన్సిలర్లు, రంధి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us