స్వయం సహాయ సంఘాల మహిళలకు దసరా కానుక

UPDATED 26th SEPTEMBER 2018 WEDNESDAY 8:00 PM

సామర్లకోట: చంద్రన్న పసుపు కుంకమ పథకం క్రింద అక్టోబరు నెలలో 86 లక్షల స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.రెండు వేలు దసరా కానుకగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర సెర్ప్, మహిళా, శిశు, వికలాంగ వయోవృద్ధుల సంక్షేమశాఖా మంత్రి పరిటాల సునీత తెలిపారు. స్థానిక పూర్ణా కళ్యాణ మండపంలో సెర్ప్  ఆధ్వర్యంలో జిల్లాలోని మండల సమాఖ్య లీడర్లు, వెలుగు సిబ్బందికి చంద్రన్న పసుపు కుంకుమ, వడ్డీ రాయితీ పథకాలపై అవగాహనా కార్యక్రమం బుధవారం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సెర్ప్, మహిళా సాధికారత శిశు, వికలాంగ వయోవృద్ధుల సంక్షేమశాఖా మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిధిగాను, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ విశిష్ట అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సమానత్వానికి, రాజకీయ చైతన్యానికి స్వర్గీయ ఎన్టీఆర్ నాంది పలకగా, మహిళా సాధికారతకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునాది వేశారని తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా గడిచిన నాలుగు సంవత్సరాల్లో స్వయం సహాయ సంఘాలకు రూ. 2,514 కోట్లు వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. బడ్జెట్ లోటు తీవ్రంగా ఉన్నప్పటికి మహిళకు ఇచ్చిన హామీ మేరకు 86 లక్షలు డ్వాక్రా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి నిధిగా 8,600 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా మూడు విడతలుగా ఒక్కొక్కరికి రూ. ఎనిమిది వేలు చొప్పున 6,833 కోట్లు సభ్యుల పొదుపు ఖాతాలకు ఇప్పటికి జమచేయడం జరిగిందని, మిగిలిన రూ.రెండు వేలు వచ్చేనెలలో దసరా పండుగ సందర్బంగా పసుపు కుంకుమ కానుకగా పంపిణీ చేయనున్నామని తెలిపారు. పెట్టుబడి నిధి అర్హులైన సంఘాల సభ్యులందరికి సక్రమంగా అందేలా చూసేందుకుసెర్ప్ ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి కార్యక్రమాన్ని స్వయం సహాయక ఉద్యమానికి పట్టుగొమ్మయిన  తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. సంఘాల్లోని ప్రతీ మహిళా నెలకు రూ.10 వేలు ఆదాయం పొందేలా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ సాధికారత కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని కోరుతూ ఇందుకు దన్నుగా నిలుస్తున్న తమ ప్రభుత్వాన్ని ఆదరించి అండగా నిలవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక, స్వాతంత్యం, సామాజిక చైతన్యం తమ ప్రభుత్వమే కల్పించిందని అన్ని రంగాల్లో మహిళలకే పెద్ద పీట వేస్తుందన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్లమెంటు సభ్యులు ఎం. మురళీమోహన్ మాట్లాడుతూ మహిళలకు సముచిత గౌరవం అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాలానిదే అని, మహిళలకు ఆస్తిహక్కు, స్థానిక సంస్థల్లో 30 శాతం ప్రాతినిధ్యం, టిడిపి పార్టీ పాలనలోనే వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా, సెర్ప్ సిఇవో కృష్ణమోహన్, డిఆర్డీఏ పిడి ఎన్. మధుసూదనరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగదుర్గ, సామర్లకోట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, పెద్దాపురం ఏఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, సామర్లకోట ఏఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యులు కందుల విశ్వేశ్వరరావు, శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us