ముంబయి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. డిసెంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దృష్ట్యా మదుపర్లు అప్రమత్తత పాటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. దీంతో ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈ ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత కాసేపు పుంజుకున్నట్లే కన్పించాయి. 57,755 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 58వేల మార్క్‌ను దాటింది. అయితే మధ్యాహ్నం తర్వాత దిగ్గజ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఫలితంగా 57,578 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివర్లో మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ స్వల్పంగా 12 పాయింట్లు నష్టపోయి 57,794 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 17,146 - 17,264 మధ్య కదలాడి చివరకు 9 పాయింట్ల నష్టంతో 17,204 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. లోహ, రియల్టీ, చమురు రంగ సూచీలు 1శాతం మేర కుంగాయి. నిఫ్టీలో ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు రాణించగా.. బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్ లిమిటెడ్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.