UPDATED 20th JULY 2022 WEDNESDAY 12:30 PM
YS Jagan: ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించి, పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. మొదటి దశలో రూ.3,786 కోట్లతో 850 ఎకరాల్లో నిర్మించనున్నారు.
ఈ పోర్టు ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలకే పరిమితమైన విషయం తెలిసిందే. 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. అలాగే, ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలకు రూ.175.04 కోట్లు ఖర్చు చేస్తోంది.పోర్టు నిర్మాణం ద్వారా ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశారు. అలాగే, పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాయి. కాసేపట్లో జరిగిఏ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. కాగా, ఉలవపాడు మండలం జాతీయ రహదారికి 4.5 కిలోమీటర్ల దూరంలోనే పోర్టు నిర్మాణం జరుగుతుంది. తొలిదశ పనులు రెండున్నరేళ్ళలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ మారిటైం బోర్డు కింద ఈ ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తుంది. మొదటి దశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం జరగనుంది. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం ఈ బెర్తులను నిర్మిస్తారు.