Anjalidevi : తెలుగుతెర సువర్ణసుందరి అంజలీదేవి

★ కలియుగ అభినవ సీతగా ఖ్యాతి

★ పుట్టిన గడ్డకే వన్నెతెచ్చిన మహానటి

★ నేడు అంజలీ దేవి వర్థంతి

పెద్దాపురం ‌(రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022: సాత్విక, కరుణరసాత్మక, పవిత్రమైన పాత్రలతో తెలుగు ప్రేక్షక హృదయాలను మైమరపించిన మహానటి ఆమె. కలియుగ అభినవ సీతమ్మగా తెలుగు సినీ రంగంలో ఖ్యాతి నార్జించిన అందాల నటి అంజలీదేవి. ఆరోజుల్లో రూ.30 వేల పారితోషకాన్ని తీసుకున్న అతి ఖరీదైన నటీమణిగా ఆమె ఖ్యాతికెక్కారు. కేవలం తన నటనతోనే కాకుండా అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఆమె ప్రత్యేకత. నటనలో ఆమెకు సాటి మరెవరూ రారు. 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి అంజలీదేవి. 1927 ఆగస్టు 24 తేదీన ఆమె తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీకుమారి. సినిమా ప్రస్థానంలో ఆమె పేరును ఆనాటి ప్రముఖ దర్శకుడు సి.పుల్లయ్య అంజలీదేవిగా మార్చారు. ఆమె బాల్యం నుంచి యుక్త వయస్సు వరకూ పెద్దాపురం పట్టణంలో గడిపారు.

★ రంగస్థలంతో నటనా జీవితం ప్రారంభం..

అంజలీదేవీ తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించారు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్నపాత్రలో పరిచయమయ్యారు. ఆతరువాత కష్టజీవి లో నాయికగా నటించింది. లవకుశలో ఎన్‌టీ రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాయి. ఆపాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించేందుకు వెళ్లగా అక్కడ కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా ఆమెకు సాష్టాంగపడిన సందర్భాలు ఉన్నాయని పలువురు ఇప్పటికీ చెబుతుంటారు. అలాగే సువర్ణ సుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననలందుకుంది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఆమె నటించారు. అలాగే బృందావనం, అన్నా వదిన, పోలీస్‌ అల్లుడు చిత్రాలు ఆమె చివరిగా నటించిన చిత్రాలుగా చెబుతుంటారు.

★ కుటుంబ నేపథ్యం..

అంజలీదేవి ప్రముఖ సంగీత దర్శకుడు పి. ఆదినారాయణను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. అలాగే ఆమె నిర్మాతగా అంజలీ పిక్చర్స్‌ పేరుతో పలు సినిమాలను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, అనార్కలి, భక్తతుకారాం, అలాగే ఛంఢీప్రియ, కన్నవారి ఇల్లు, మహాకవి క్షేత్రయ్య, సతీసుమతి, స్వర్ణమంజరి, అమ్మకోసం, సతీ సక్కుబాయి, సువర్ణసుందరి మొదలయిన సినిమాలు ఆమె నిర్మాతగా నిర్మించారు.

★ ఎన్నో పురస్కారాలు, అవార్డులు..

నటి అంజలీదేవి ఎన్నో పురస్కారాలు, అవార్డులను అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌, రఘుపతి వెంకటరత్నం పురస్కారం, రామినేని పురస్కారం, ఏఎన్‌ఆర్‌ పురస్కారాలతో పాటు మరెన్నో అవార్డులను, పురస్కారాలను ఆమె సొంతం చేసుకున్నారు. అలాగే ఆమె సుమారు 500 చిత్రాల్లో నటించారు. అందులో జననీరాజనాలు అందుకున్న చిత్రాలు మాత్రం లవకుశ, ఇలవేల్ప రంగులరాట్నం. లవకుశ చిత్రంతో ఆమె తెలుగు ప్రజల హృదయపీఠంపై సీతమ్మ తల్లిగా కొలువుతీరారు.

★ అంజలీదేవికి గుర్తుగా పెద్దాపురంలో విగ్రహం ఏర్పాటు..

అంజలీదేవిపై ఉన్న అభిమానంతో ఆమె గుర్తుగా పట్టణంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. పైగా ఆమె మరణానంతరం ఆమె పేరుతో ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం ఆమె పేరుతో ఫౌండేషన్‌ తరుపున పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us