UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 06:00 AM
◆ అంతర్వేదిలో మాఘపౌర్ణమి సందడి
◆ చక్ర పెరుమాళ్స్వామికి పున్నమి స్నానం
అంతర్వేది: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మాఘపౌర్ణమి పురస్కరించుకుని బుధవారం స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ఆలయం వద్ద నుంచి అలంకార మండపంలో అర్చకుల పూజలందుకున్న స్వామివారు రుద్రరాజు బంగారమ్మ బహూకరించిన గరుడ పుష్పక వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల నృసింహనామ శరణాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.
స్వామివారి గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పల్లకీలో సుదర్శన చక్రధారుడైన పెరుమాళ్ స్వామిని మంగళవాయిద్యాల నడుమ సముద్ర తీరానికి తీసుకువెళ్లారు. అక్కడ స్వామికి, చక్రపెరుమాళ్ స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్, పెద్దింటి జగన్నాథచార్యులు, స్థానాచార్యులు వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకటశాస్త్రి, పేరూరు ఉద్దండ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ చైర్మన్, ఫ్యామిలీ ఫౌండర్ రాజా రామగోపాల రాజాబహుద్దూర్, ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, డీఎస్పీ వై మాధవరెడ్డి, ఎంపీపీ వీరా మల్లిబాబు, తహశీల్దార్ రమాకుమారి, డిప్యూటీ తహశీల్దార్ భాస్కర్, వాహన కారులు, భక్తులు పెద్దఎత్తున స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పేరూరు ఉద్దండ పండితుల శిరస్సుపై శ్రీ చక్రపెరుమాళ్ను ఉంచి సముద్ర స్నానం చేయించారు.
స్వామితోపాటు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, అగ్నికుల క్షత్రియులు పున్నమి స్నానాలు చేశారు. మాఘమాసం బుధవారం పౌర్ణమి కావడంతో సముద్ర తీరమంతా భక్తులతో కళకళలాడింది. స్వామి చక్రస్నానంతోపాటు భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పూజలు అందుకున్న స్వామి, చక్రపెరుమాళ్ను వసంత మండపానికి అర్చకులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.
స్వామికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదం పంచారు. రాత్రి అర్చకులు ధ్వజావరోహణం నిర్వహించారు.