UPDATED 5 FEBRUARY 2022 SATURDAY 12:01 AM
అమరావతి (రెడ్ బీ న్యూస్): పీఆర్సీ వ్యవహారంపై.. మంత్రులతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు ఇరు వర్గాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అంతకుముందు.. తమ డిమాండ్లకు అంగీకరించకుంటే సమ్మె తప్పదన్న ఉద్యోగుల హెచ్చరికలను ఓ దశలో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి చర్చలకు నిర్ణయించింది. ఆ మేరకు.. మంత్రుల బృందం పిలుపుతో.. ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ చర్చలకు హాజరయ్యారు. తమ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో.. తమ డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ముందుంచారు.
● పీఆర్సీ రిపోర్ట్ బయటపెట్టాలి
● ఫిట్ మెంట్ కనీసం 27శాతం తగ్గకుండా ఇవ్వాలి
● హెచ్ఆర్ఏ శ్లాబ్ రేట్లు పాతవే కొనసాగించాలి
● ఐదేళ్లకోసారి పీఆర్సీని అంగీకరించాలి
● సీసీఏను కొనసాగించాలి
● పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కొనసాగించాలి
● కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం స్కేల్ ఇవ్వాలి ● గ్రామ సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలి
● మార్చి 31లోగా.. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలి
● స్టేట్ పీఆర్సీ కొనసాగించాలి ఈ డిమాండ్లలో చాలా వాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా.. ఐదేళ్లకోసారి పీఆర్సీకి ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి జగన్ కు శనివారం ఉదయం.. మంత్రుల బృందం నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఆ తర్వాత.. సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్చలు, ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న అంశాలపై.. అధికారిక ప్రకటన వస్తేనే.. వాస్తవాలపై స్పష్టత రానుంది. మరోవైపు.. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందన రాకుంటే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి (తెల్లవారితే సోమవారం) నుంచి సమ్మెకు దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.