UPDATED 13 MARCH 2022 SUNDAY 08:20 AM
Road Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. కృష్ణజిల్లా జగయ్యపేట వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ-హైదరాబాద్ -65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు..జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో సాగర్ కెనాల్ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టుని ఢీకొట్టింది.
ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాద స్థలికి చేరుకున్న మొబైల్ టీం అండ్ నేషనల్ హైవే టీం.. ప్రమాదంలో గాయపడ్డ ఓ చిన్నారిని, మరో ఇద్దరినీ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం పై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.