అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య రథం ప్రారంభం

* నూతన రథానికి శాస్త్రోక్తంగా సీఎం పూజలు
* రథం లాగి స్వామి వారి కల్యాణోత్సవాలకు శ్రీకారం 
* స్వల్ప వ్యవధిలో రథం నిర్మాణంపై ప్రశంస

UPDATED 19th FEBRUARY 2021 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావ‌రి జిల్లా స‌ఖినేటిప‌ల్లి మండ‌లం అంత‌ర్వేదిలో కొలువైఉన్న శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి ఆల‌యంలో రూ.1.16 కోట్ల‌తో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన నూతన దివ్య ర‌థాన్ని రధ సప్తమి పర్వదినాన రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. ఉద‌యం 11.30 గంట‌లకు అంత‌ర్వేదిలోని ఫిషింగ్ హార్బ‌ర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి  పినిపే విశ్వరూప్, ‌స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వ‌నితతో పాటు జిల్లా క‌లెక్ట‌ర్ డి. ముర‌ళీధ‌ర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, అమ‌లాపురం స‌బ్-క‌లెక్ట‌ర్ హిమాన్షు కౌశిక్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్వామి వారి ఆల‌య రాజ‌గోపురం వ‌ద్దకు చేరుకున్న ముఖ్య‌మంత్రికి మేళ‌ తాళాలు, ఆలయ మర్యాదలతో అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తొలుత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, రాజ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని దర్శించుకున్న అనంతరం ఆశీర్వచన మండపంలో పండితుల వేదాశీర్వచనం, శేష వస్త్రం స్వీకరించారు. తదుపరి ఆల‌య ప్రాంగ‌ణంలో 41 అడుగుల ఎత్తు, ఏడు అంత‌స్తుల‌తో స్వల్పకాల వ్యవధిలో నూత‌నంగా నిర్మించిన స్వామి వారి దివ్య ర‌థానికి ముఖ్యమంత్రి ఆగమ శాస్త్రాల ప్రకారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించి మంత్రులు, తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి తాడు లాగి రథాన్ని ప్రారంభించారు. 

అందుబాటులోకి నూత‌న రథం
అంతర్వేది క్షేత్రంలో గత సంవత్సరం సెప్టెంబ‌ర్ నెల ఐదవ తేదీన స్వామివారి దివ్య ర‌థం అగ్నికి ఆహుతైన నేప‌థ్యంలో నూత‌న ర‌థం నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు దేవాదాయ శాఖ కమీషనర్ ప్రత్యేక క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి అమ‌లాపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా క‌న్వీన‌ర్‌గా దేవాదాయ శాఖ రీజ‌న‌ల్ జాయింట్ కమీషనర్, స‌భ్యులుగా డిప్యూటీ కమీషనర్ (కాకినాడ‌), ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ (కాకినాడ‌), ఉప స్త‌ప‌తి (కాకినాడ‌), ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (అంత‌ర్వేది), జిల్లా అట‌వీ అధికారి (కాకినాడ‌) వ్య‌వ‌హరించారు. నూతన ర‌థం నిర్మాణ ప‌నుల స‌మ‌న్వ‌యానికి అడిష‌న‌ల్ కమీషనర్-2ను ప్ర‌త్యేక అధికారిగా దేవాదాయ శాఖ కమీషనర్ నియ‌మించారు. ర‌థం నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నాణ్య‌మైన బ‌స్త‌ర్ టేకును రావుల‌పాలెంలోని శ్రీ సాయి టింబ‌ర్ డిపోలో ప్ర‌త్యేక క‌మిటీ గుర్తించింది. గత సంవత్సరం సెప్టెంబ‌ర్ నెల 27న అధిక ఆషాఢ శుద్ధ ఏకాద‌శి రోజున నూత‌న ర‌థం నిర్మాణ ప‌నులు ప్రారంభించి డిసెంబ‌ర్ 25 వైకుంఠ ఏకాద‌శి నాటికి నిర్మాణం పూర్తిచేశారు. రథం నిర్వ‌హ‌ణ‌, ర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకొని  ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హైడ్రాలిక్ బ్రేకింగ్ వ్య‌వ‌స్థ‌తో పాటు జాకీని ఏర్పాటు చేశారు. స్వల్పకాల వ్యవధిలో స్వామి వారి కల్యాణోత్సవాలనాటికి సర్వాంగ సుందరంగా రధ నిర్మాణం పూర్తి చేసిన కమిటీని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజ్య‌స‌భ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, కాకినాడ, అమ‌లాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీలు వంగా గీతా విశ్వ‌నాథ్‌, చింతా అనురాధ‌, మార్గాని భ‌ర‌త్‌రామ్‌; ‌ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, ‌రాజోలు, కాకినాడ అర్బ‌న్‌, గ‌న్న‌వ‌రం, ముమ్మిడివ‌రం, పిఠాపురం ఎమ్మెల్యేలు రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, కొండేటి చిట్టిబాబు, పొన్నాడ వెంక‌ట సతీష్ కుమార్‌, పెండెం దొర‌బాబు, డీసీసీబీ చైర్మన్ అనంత ఉద‌య భాస్క‌ర్, ‌ఎస్‌సీ కార్పోరేషన్ ఛైర్‌ప‌ర్స‌న్ పెద‌పాటి అమ్మాజీ, డీఐజీ కెవి రామ్మోహ‌న్‌రావు, దేవాదాయ శాఖ కమీషనర్ పి. అర్జున‌రావు, డిప్యూటీ కమీషనర్ ఎం. విజ‌య‌రాజు, ఆల‌య ఈవో య‌ర్రంశెట్టి భ‌ద్రాజీ, అమలాపురం డిఎస్పీ వై. మాధవరెడ్డి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు..
 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us