వైభవంగా ప్రారంభమైన సత్యనారాయణస్వామి కల్యాణోత్సవాలు

UPDATED 14th MAY 2019 TUESDAY 10:00 PM

అన్నవరం: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి కల్యాణ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, పండిత బృందం కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి సుబ్రహ్మణ్యఘనాపాఠి, నాగాభట్ల కామేశ్వరశర్మ, చామర్తి కన్నబాబుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, గౌరీ పూజ, తదితర పూజలు నిర్వహించిన అనంతరం  సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి వేడుకలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముత్తయిదువులు పసుపు దంచారు. అనంతరం అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి. రోహిత్‌, కార్యనిర్వహణాధికారి ఎం.వి. సురేష్‌బాబు దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 
సరదాగా సాగిన ఎదుర్కోలు ఉత్సవం
రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం సందడిగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్‌ ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి ఎం.వి. సురేష్ బాబు, వేద పండితులు స్వామి, అమ్మవార్ల తరఫున రెండు వర్గాలుగా ఏర్పడి స్వామి, అమ్మవార్ల కీర్తి ప్రతిష్ఠలు, గుణగణాలు, వంశ చరిత్రను కీర్తిస్తూ ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటలకు సీతారాముల వారిని వెండి ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
నేడు సత్యదేవుని దివ్య కళ్యాణం  
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామాలయం పక్కనే కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us