చిరంజీవిని టార్గెట్ చేసిందెవరూ?

అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : మెగాస్టార్‌ చిరంజీవిని టార్గెట్ చేశారు. ఆయనను టార్గెట్ చేసింది ఎవరు అనేది ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు సినిమా పరిశ్రమలోనూ చర్చ జరుగుతుంది. అధికార పార్టీ పథకం ప్రకారం లీకులు ఇచ్చి తమ అభిమాన హీరోను అప్రతిష్టపాలు చేశారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పుణ్యానికి పోతే ఈ రాజకీయ రొంపిలోకి దించింది ఎవరనే అంశంపై చిరంజీవి కూడా ఆరాతీస్తున్నారు. సినిమా పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వ ఆహ్వానం మేరకు వచ్చిన చిరంజీవి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత చిరంజీవి హైదరాబాద్‌‌కు వెళ్తూ గన్నవరం ఎయిర్‌పోర్టులో చర్చలు బాగా జరిగాయని చెప్పిమరీ వెళ్లారు. ఆయన వెళ్లిన తరువాత మరుసటి రోజు ఉదయం అంటే శుక్రవారం చిరంజీవికి జగన్‌, రాజ్యసభ టిక్కెట్‌ ఇస్తానని ప్రతిపాధించారని ప్రచారం జరిగింది. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం పక్కకుపోయి, చిరంజీవికి రాజ్యసభ అంశం తెరపైకి వచ్చింది. వైసీపీకి దూరమవుతున్న కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే కొత్త ఎత్తుగడకు తెర తీశారని ప్రచారం జరిగింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి కాపు సామాజికవర్గం దూరమైంది. ఈ సామాజికవర్గాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు పథకం వేశారని అంటున్నారు. ఈ ప్రచారం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందని కొంతమంది భావిస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం విజయవాడ వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజ్యసభ టిక్కెట్‌ ఇస్తానని తనకు ఎవరూ ప్రతిపాధించలేదని చిరింజీవి స్పష్టం చేశారు. ఇటువంటి ఊహాగానాలను నమ్మవద్దని కూడా చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us