ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికం కాకినాడ

* రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామంత్రి కురసాల కన్నబాబు
* స్మార్ట్ సిటీ భవనం, జన్మభూమి పార్క్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

UPDATED 5th NOVEMBER 2019 TUESDAY 6:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): కోస్తా తీరంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తలమానికమైన కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన స్మార్ట్ సిటీ భవనం, జన్మభూమి పార్క్ ను మంత్రి కన్నబాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ నగర నిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉందని, దీన్ని మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. పెన్షనర్స్ పేరడైజ్ గా కాకినాడ నగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, అలాంటి ప్రశాంత నగరంలో స్మార్ట్ సిటి భవనం నిర్మించుకోవడం శుభ పరిణామమని అన్నారు. 2020 సంవత్సరం వరకు స్మార్ట్ సిటీ నిధులు వినియోగించుకొనే అవకాశం ఉందని, అనంతరం ఐదు సంవత్సరాలు ఆ నిధులతో నిర్వహణ పనులు జరుగుతాయని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరంలో జనాభా కూడా పెరుగుతున్న నేపధ్యంలో 2050 సంవత్సరం నాటికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అర్బన్ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా జనాభా అధికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నామన్నారు. ఇప్పటికే అనపర్తి, జగ్గంపేట పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలో  మంచి నీటి సమస్యను అధిగమించడానికి వాటర్ గ్రిడ్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ భవనానికి వైయస్ఆర్ స్మార్ట్ సిటీ భవనంగా నామకరణం చేసే
ప్రతిపాదనలు కాకినాడ నగర పాలక సంస్థ ఆమోదంతో త్వరలో ప్రకటించడం జరుగుతుందని అన్నారు. అలాగే నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రత్యేకతలు ఉండే విధంగా స్మార్ట్ సిటీ భవనాన్ని రూ. 5.4 కోట్లతో నిర్మించడంతోపాటు, భానుగుడి సమీపంలో గల జన్మభూమి పార్కును రూ. రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ భవనంలో కమాండ్ కంట్రోల్ రూంతో పాటు 676 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాలు, వెయిటింగ్ లాంజ్, స్మార్ట్ రూములతో పాటు చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, 48 మంది సిబ్బంది క్యాబిన్లు, డైనింగ్ హాలు, స్మార్ట్ రూంలు ఇందులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో కాకినాడ నగర పారిశుధ్య పనులు నిమిత్తం ఒక కారిఫెటర్ (లారీ ట్రాక్), రెండు ఇఎక్స్-20 మిని జైన్స్, ఒక జేసిబి, 15 ఫాగింగ్ దోమల నిర్మూలన యంత్రాలను మంత్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించి శానిటేషన్ సిబ్బందికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ కె. రమేష్, కార్పొరేటర్లు ఎన్. సుజాత, లక్ష్మీ ప్రసన్న, జి. వెంకట సత్యవతి, సిహెచ్. ప్రసాద్ మాస్టారు, వి. రాంబాబు, సి. రాంబాబు, జి. దానమ్మ, ఎస్. లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us