UPDATED 8th APRIL 2022 FRIDAY 08:20 AM
Olivia Morris : చరణ్, తారక్ లతో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీల నుంచి ఈ సినిమాపై, సినిమాలోని నటి నటులపై, రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఈ సినిమాలో బ్రిటిష్ యువతిగా, ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జెన్నీఫర్ అనే బ్రిటిష్ యువతిగా ఒలీవియా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒలీవియాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవల ఒలీవియా ఓ తెలుగు ఛానల్ కి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ సందర్బంగా ఒలీవియా అనేక ఆసక్తికర విషయాలని వెల్లడించింది. ఒలీవియా మాట్లాడుతూ.. ” మొదటి రోజే యూకేలో నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఈ సినిమా చూశాను. ఈ సినిమాలోని ‘కోమురం భీముడో’ పాటలో తారక్ నటనకు ఫిదా అయ్యాను. ఆ పాటలో తారక్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చాయి, మరి కొన్ని సన్నివేశాల్లోనూ భావోద్వేగానికి గురయ్యాను. ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్” అంటూ ఎన్టీఆర్ పై పొగడ్తల జల్లు కురిపించింది. అంతే కాక.. ”ఈ సినిమాలో నాటు నాటు పాట బాగా నచ్చింది, ఈ పాటకు నా బాయ్‌ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడు.
రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్. హైదరాబాద్‌లో నేను 20 రోజులు ఉన్నాను, కానీ బిజీ షెడ్యుల్ కారణంగా హైదరాబాద్ మొత్తం చూడలేకపోయాను, హైదరాబాద్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీకి బహుమతులు కూడా తీసుకొచ్చాను” అని ఒలీవియా తెలిపింది. ఆర్ఆర్ఆర్ లో ఒలీవియా క్యూట్ నటనకి మన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నెటిజన్లు అయితే మీమ్స్ లో ఒలీవియాని బాగా పొగుడుతూ పోస్టులు చేశారు.