గ్రామ సచివాలయాల్లోనే అన్ని రెవెన్యూ సేవలు

* జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి

UPDATED 17th JUNE 2020 WEDNESDAY 7:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో ఇక గ్రామ సచివాలయాల్లోనే అన్ని రెవెన్యూ సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలక్టర్ కార్యాలయం విధాన గౌతమీ హాలులో బుధవారం నిర్వహించిన గ్రామ రెవెన్యూ సహాయకులను గ్రామ రెవెన్యూ అధికారులు (గ్రేడ్-2)గా పదోన్నతి కల్పించే కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పరిపాలనకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి కీలకమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, గ్రామంలో ఏ సంఘటన జరిగినా గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చే నివేదిక ప్రధానమైదని అన్నారు. గతంలో కంటే ప్రభుత్వ పరిపాలనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు సిద్ధం కావాలని తెలిపారు. ప్రతీ రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడంతో పాటు, సచివాలయంలో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామ రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు గ్రామ సచివాలయాల్లో అందించే వివిధ సేవలు నిమిత్తం 5 లక్షల దరఖాస్తులు నమోదు కావడం జరిగిందని,  రాష్ట్రం మొత్తం మీద ఇది అధికమని తెలిపారు. ఈ పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ రాష్ట్రం మొత్తం మీద జిల్లాలో మొదటిగా ప్రారంభమైందని, పదోన్నతి పొందుతున్న ఉద్యోగులు  నిజాయతీగా, సేవా దృక్పధంతో పని చేయాలని, విధుల నిర్వహణలో ఎక్కడా అవినీతికి చోటు ఇవ్వరాదని ఆయన పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి రెవిన్యూ శాఖ ఎంతో కీలకమైనదని, పదోన్నతి పొందుతున్న రెవెన్యూ ఉద్యోగులు విధి నిర్వహణలో తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ రెవెన్యూ శాఖ ఉన్నతికి కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో గల 655 గ్రామ రెవెన్యూ అధికారులు గ్రేడ్ -2 ఖాళీలకు సంబంధించి అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులు సీనియారిటీ జాబితాను అనుసరించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతి కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతీరోజు 150 మందికి (ఉదయం- 75, మధ్యాహ్నం-75) కౌన్సిలింగ్ నిర్వహించి ఈనెల 23వ తేదీన పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలక్టరేట్ ఏవో జి.ఎస్. శ్రీనివాస్, ఇతర రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us