UPDATED 11th MARCH 2022 FRIDAY 07:50 PM
Chandrababu On Mystery Deaths : ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రాణాలు పోతున్నా స్పందించరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల అస్వస్థతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేవారు. నాణ్యత లేని ఆహారంతోనే నంద్యాల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చంద్రబాబు ఆరోపించారు.
కుళ్లిన కోడి గుడ్లు పెట్టడం వల్లనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని చెప్పారు.(Chandrababu On Mystery Deaths) ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ప్రాణాలు పోతున్నా స్పందించరా? అని చంద్రబాబు నిలదీశారు. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని వాపోయారు.
మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం 92 మంది విద్యార్థులు భోజనం చేశారు. వెంటనే వారిలో పలువురు వాంతులు చేసుకున్నారు.
వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. పాడైన గుడ్లను వడ్డించడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(Chandrababu On Mystery Deaths) మరోవైపు ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, వాంతులతో విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని… మధ్యాహ్న భోజనంలో గుడ్డు, సాంబారు తిన్నారని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చికిత్స తర్వాత విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఏపీలో మిస్టరీ మరణాలు కలకలం రేపుతున్నాయి.
రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 15 మంది హఠాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్నపాటి నలతగా ఉండటం ఆస్పత్రికి వెళ్లిన గంటల్లోనే చనిపోవడం వంటి ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతి చెందారు.
వీరిలో పది మందికి పైగా 40- నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్నవారే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నట్లుండి అస్వస్థతకు గరికావడం సమస్య ఏంటో గుర్తించేలోపే ప్రాణాలు కోల్పోవడం జరగుతోంది. దీంతో వారి కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోతున్నాయి.
మృతులంతా కూలిపనులు, చిన్నచిన్న వృత్తులు చేసుకునే వారే. అస్వస్థతకు గురిన వెంటనే ఆర్ఎంపీలు, స్థానిక డాక్టర్ల దగ్గర ట్రీట్ మెంట్ తీసుకున్న అనంతరం.. పెద్దాస్పత్రులకు వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారు. ఎక్కువ మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలతోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ మిస్టరీ మరణాల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. అయితే కల్తీసారా కారణంగా వీరంతా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుల్లో చాలామంది రోజువారి కూలి పనులు చేసుకునేవారే.ఈ మిస్టరీ మరణాలకు నాటుసారానే కారణమని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.
ప్రభుత్వ దుకాణాల్లో నాసిరకం మద్యం విక్రయిస్తూ, మరోవైపు గ్రామాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాటు సారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మద్యపాన నిషేధం అమలు చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవా? ఇంతమంది మహిళల మంగళ సూత్రాలు తెగేవా? అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.