అంతర్ వర్సిటీ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో ఉపకులపతి ప్రసాదరాజు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021: జేఎన్టీయూకే పరిధిలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని.. ప్రతి విద్యార్థినీ ఏదో ఒక క్రీడలో ప్రోత్సహించాలనేది తమ లక్ష్యమని ఉపకులపతి ఆచార్య ప్రసాదరాజు పేర్కొన్నారు. బుధవారం వర్సిటీలోఅనుబంధ కళాశాలలు, క్యాంపస్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ, త్వరలో అనుబంధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల ర్యాటిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. అంతర్ కళాశాలల పోటీల నిర్వహణకు నిధులు కేటాయించి, ఏర్పాట్లు చేస్తామన్నారు. నరసరావుపేటలోని జేఎన్టీయూకే యూసీఐఎన్ క్యాంపస్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. క్యాంపస్ కళాశాలల్లో అర్హులైన ఫిజికల్ డైరెక్టర్లను నియమిస్తామన్నారు. రిజిస్ట్రార్ ఎల్.సుమలత మాట్లాడుతూ క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిని అందించాలన్నారు. ఓఎస్డీ ఆచార్య రవీంద్రనాథ్ మాట్లాడుతూ క్రీడలతో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు. అనంతరం 2018-19, 2019-20లో అంతర్ కళాశాలల పోటీల విజేతలకు పతకాలు, నగదు బహుమతులు అందజేశారు. క్రీడల్లో పీహెచ్డీ సాధించిన ఫిజికల్ డైరెక్టర్లను సత్కరించారు. ప్రతినిధులు జీపీ రాజు, జి.శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు