ప్రగతిలో ఘనంగా ప్రిజమ్-2019 వేడుకలు

UPDATED 12th JANUARY 2019 SATURDAY 10:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల సాంస్కృతిక విభాగం, ప్రగతి కల్చలర్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రిజమ్-2019 సాంస్కృతిక ఉత్సవాలు శనివారం కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రహ్మశ్రీ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రగతి కల్చరల్ క్లబ్ ప్రార్ధనా గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. కళానైపుణ్యాలను ప్రతిబింబించే విధంగా కళాశాల ప్రాంగణాన్ని విద్యార్థినులు రంగవల్లులతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ కళాశాల సాధిస్తున్న ప్రగతి పట్ల తమ సంతృప్తిని వ్యక్తపరుస్తూ గురువర్యుల దివ్య ఆశీస్సులతో ప్రారంభించబడిన తమ కళాశాల దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోందని వారికి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. యువజనుల పురోగతికి పలు సూచనలు అందించిన స్వామి వివేకానందుని బోధనల నుంచి స్ఫూర్తి పొంది విద్యార్థులు అభివృద్ధి పథంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్ధుల పురోగతికి అవరోధాలు కలిగించే మూడు ప్రధాన అంశాలైన క్రికెట్, సినిమా, రాజకీయ రంగాల్లోని పోకడలను గమనిస్తూ వాటి దుష్ప్రభావాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ ముఖ్య అతిధిని సాదరంగా ఆహ్వానించిన అనంతరం వార్షిక నివేదికలో విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా, క్రీడా, సామాజిక సేవ వంటి వివిధ రంగాలలో 2018-19 సంవత్సరంలో తమ కళాశాల సాధించిన విజయాలను పేర్కొన్నారు. ముఖ్య అతిథి చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి ప్రసంగిస్తూ ఉన్నత ఆశయాలతో స్థాపించబడిన ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్ధులు పురోగతి సాధిస్తారని తమ దివ్య ఆశీస్సులు అందచేశారు. అంతేకాక విద్యార్థులు చదువుతో పాటు సాంప్రదాయాలను అలవర్చుకుంటూ తమ తల్లిదండ్రుల పట్ల తమ కర్తవ్యాలు మర్చిపోకుండా మెలగాలని హితవు పలికారు. అనంతరం ముఖ్య అతిధి చేతుల మీదుగా 2014-18 సంవత్సరం అకడమిక్ టాపర్స్ కు బహుమతులు ప్రధానం చేశారు. ఉత్తమ అవుట్ గోయింగ్, రెండవ ఉత్తమ అవుట్ గోయింగ్  విద్యార్థులకు బంగారు పథకాలు, నగదు బహుమతి ప్రధానం చేశారు. కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తల్లి పరుచూరి కమలాంబ జ్ఞాపకార్ధం 2015-2019 సంవత్సరాల్లో అన్ని విభాగాల్లో ప్రథమ, ద్వితీయ అకడమిక్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థినులకు నగదు పురస్కారాలు అందచేశారు. అనంతరం విద్యార్థినుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థినీ,  విద్యారులు తమ ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శిస్తూ వివిధ ప్రదర్శనలను ఇచ్చారు. సందేశాత్మక స్కిట్ తో ఉర్రూతలూగించే నృత్యాలతో, వీనులవిందు చేసే పసందైన పాటలతో ఈ కార్యక్రమం ఆద్యంతం సభికులను మైమరపింపజేసింది. సామాజిక సేవ పట్ల తమ వంతు పాత్రను యువతకు గుర్తు చేస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాలు, అధునాతన, సనాతన సంస్కృతుల మేలుకలయికగా సాగిన “ఫ్యాషన్ పేరేడ్” విశేషంగా  అలరించాయి. అలాగే కళాశాల పురోగతిలో ప్రముఖపాత్ర వహిస్తున్న సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఏ. కైలాసరావు, ప్రొఫెసర్ బి. వెంకటేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాథబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డాక్టర్ వై. జయబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ప్రిజమ్ ప్రధాన కోఆర్డినేటర్లు కె. రఘురామ్, కె. లక్ష్మీవివేక, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us