విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021: ఏపీలో సీఐడీని కక్ష సాధింపులకు వాడుకోవడం దారుణమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు సంబంధమేంటని నిలదీశారు. విశాఖలో అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిధుల కేటాయింపునకు సంతకం చేసిన ప్రేమచంద్రారెడ్డిని వదిలేసి గంటా సుబ్బారావును అరెస్టు చేయడం అరాచకానికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఎందుకు పెట్టారో సీఎం జగన్కు తెలుసా అని ప్రశ్నించారు. అవినీతి సీఎం ఉంటే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరొస్తారని అయ్యన్న విమర్శించారు. మన పిల్లలకు ఉద్యోగావకాశాలు ఎలా వస్తాయని నిలదీశారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.