UPDATED 1st JULY 2017 SATURDAY 10:00 PM
కాకినాడ: హరితాంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాస్థాయి వనం-మనం కార్యక్రమాన్ని శనివారం స్థానిక బీచ్‌రోడ్డులోని డైరక్టర్ ఆఫ్ పోర్ట్సు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నదులు, వృక్షాలను తరతరాలుగా దేవతలుగా ఆరాధించే సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో మిళితమై ఉందని, ఈ సంస్కృతిని ప్రతిఒక్కరూ కాపాడాలన్నారు. గత ఏడాది ఉపాధి హామి పథకం కింద ప్రతి ఇంటికీ ఐదు రకాల జాతుల మొక్కలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో 10 లక్షల చొప్పున రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్నిశనివారం ప్రభుత్వ ప్రారంభించిందని, ఈ ఉద్యమాన్నివచ్చే నాలుగు నెలల పాటు కార్తీక పౌర్ణిమ వరకు కొనసాగించాలన్నారు. అలాగే అవకాశమున్న ప్రతి పాఠశాలలో నర్సరీలను ఏర్పాటుచేస్తామన్నారు. అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.పి.కజారియా మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 50 శాతానికి పెంచాలనే లక్ష్యంగా వనమహోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభ కార్యక్రమాలకు మొక్కలు ఇచ్చి తమ ఆనందాన్ని పంచుకోవాలన్నారు. అనంతరం పాఠశాల, కళాశాల విద్యార్థులు, డ్వాక్రా, యువజన సంఘాల సభ్యులతో కలిసి అంతా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, డీఎఫ్‌వోలు నందని సలారియా, జీఏపీ ప్రసూన, జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, పోర్టు పీవో ధర్మశాస్త్ర, మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, ఆర్డీవో ఎల్.రఘుబాబు, డీఈవో అబ్రహం, పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.







