హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: యూట్యూబ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ (RRR Trailer) రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి.. మరింత ముందుకు దూసుకెళ్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్‌ఆర్’. రాజమౌళి దర్శకుడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జనవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డిసెంబరు 9న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటివరకూ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారతీయ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్‌ఆర్ ట్రైలర్’ నిలిచిందని తెలిపింది. అలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు కలిసి బ్రిటిష్ వారిపై ఏవిధంగా పోరాటం చేశారన్న కోణంలో ఫిక్షనల్ స్టోరీగా రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్’ను తెరకెక్కించారు.







