టీటీ అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరామ్
శ్రీప్రకాష్ లో ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నీస్ పోటీలు
హాజరైన 13 జిల్లాల క్రీడాకారులు
పెద్దాపురం ( రెడ్ బీ న్యూస్) 30 అక్టోబరు 2021 : విద్యార్థులు అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర టేబుల్ టెన్నీస్ అకాడమీ అధ్యక్షుడు వి.భాస్కర రామ్ అన్నారు. స్థానిక రామారావుపేటలో ఉన్న శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించ నున్న రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలకు ఈ అకాడమీ ద్వారా అత్యుత్తమ క్రీడాకారులు తయారుకావాలని ఆకాక్షించారు. అత్యాధునిక సదుపాయాలతో అన్ని హంగులతో పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ టేబుల్ టెన్నిస్ అకాడమీలో క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి తమ సత్తాను చాటాలన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ దేశానికి పేరు తీసుకువచ్చే మంచి పౌరులుగా తయారుకావాలంటే క్రీడలే అందుకు తగిన ఎంపిక అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ డానియల్ ప్రదీప్, టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రావు చిన్నారావు, విశ్వనాథ్, ముక్కామల తదితరులు మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో ఇటుంవంటి టేబుల్ టెన్నీస్ అకాడమీ ఇక్కడ రూపుదిద్దుకోవడం నిజంగా గర్వకారణమన్నారు. పాఠశాల డైరెక్టర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నీస్ పోటీలకు తమ పాఠశాల వేదిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను తమ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 225 క్రీడాకారులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈపోటీలకు రిఫరీలు సూర్యారావు, వేణుగోపాల్ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







