UPDATED 14th MAY 2018 MONDAY 9:00 PM
పిఠాపురం: ఆదరణ పథకం క్రింద రూ.750 కోట్లతో వెనుకబడిన తరగతుల వారికి లబ్ధి చేకూరుస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. స్థానిక రెడ్డి రాజా కళ్యాణ మండపములో సోమవారం జరిగిన సభలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికి ఆదరణ పథకం క్రింది రూ. 750 కోట్లతో పనిముట్లను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తామని చెప్పారు. అన్ని వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి రూ. 1000 కోట్లు నిధులు కేటాయించి ఋణాలను మంజూరు చేస్తున్నామని, ఇంతవరకు రూ మూడు వేల కోట్ల ఇవ్వడం జరిగిందని, వీటిలో రూ. 13 వందల కోట్లు ఇంకా ఖర్చు చేయవలసి ఉందని అన్నారు. చేనేత వర్గాల జీవనాన్ని మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, త్వరలో సగం ధరలకే బట్టల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి త్వరలో 35 వేల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రూ. 24 వేల కోట్లు ఋణమాఫీ చేశామని చెప్పారు. రూ. 1650 కోట్లతో పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 67 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించి రైతులకు మేలు చేశామని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. రెండు వేల కోట్లు అభివృద్ధి పనులు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యే కృషికి నిదర్శనమని, ఎడమ బ్రాంచ్ కెనాల్ కు సంబంధించిన పనులు కూడా చేపడతామని, ఈ పనులు కూడా పూర్తయితే మూడు పంటలు పండించవచ్చని అన్నారు. వ్యవసాయానికి రూ. 20 వేల కోట్లు కేటాయించడం ద్వారా రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గమనించాలని, దేశంలో ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ ఉత్పత్తిలో, వృద్ధిలో ప్రథమస్థానంలో ఉందని, తరువాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉందని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవీశపెట్టి ఆ లక్ష్యంతో పనిచేస్తుందని, పేద కుటుంబములో ఉన్న ఆడపిల్లల వివాహానికి చంద్రన్న పెళ్ళి కానుక ద్వారా ఆర్ధిక సహకారం అందిస్తున్నామని చెప్పారు. చంద్రన్న భీమా పథకం ద్వారా సహజంగా మరణిస్తే రూ. రెండులక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. ఐదు లక్షలు భీమా అందిస్తున్నామని చెప్పారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు కులస్థుల్లో పేదలకు ఋణాలు మంజూరు చేయడమే కాకుండా, విదేశాలలో చదువుకోవడానికి కూడా సౌకర్యం కల్పించామని చెప్పారు. ఎస్.సి సబ్ ప్లాన్ ద్వారా గ్రామాలలో ఎస్.పి. కోలనీలో డ్రైనేజీలు, సి.సి. రోడ్డు నిర్మించామని, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అంచలంచెలుగా నెరవేరుస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులలో ప్రజలు భాగస్వాములవ్వాలని మంత్రి కోరారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో ఎంసెట్, పోలిటెక్నిక్, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విధ్యార్ధినీ, విద్యార్ధులను మంత్రులు అభినందించి నగదు బహుమతులు అందచేసారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







