UPDATED 22nd JANUARY 2018 MONDAY 4:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల శ్రీ లక్ష్మి స్టూడెంట్స్ హాస్టల్ లో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సరస్వతిదేవి పూజ ఘనంగా నిర్వహించారు. నేపాల్ కు చెందిన విద్యార్థులు ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సరస్వతీదేవికి వేదమంత్రోచ్చారణల నడుమ అత్యంత భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొని మాట్లాడుతూ వసంతపంచమి పర్వదినం ఉత్తర భారతదేశంలో బహుళ ప్రాచుర్యం పొందిందని, భారతదేశం సర్వమతాలకు నిలయమన్నారు. అన్ని మతాలను, సాంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛ భారతదేశంలో ఉన్నందువల్లే మనదేశం లౌకికదేశం అయిందన్నారు. ఆదిత్య క్యాంపస్ మిని భారతదేశంగా తలపిస్తూ వివిధ రాష్ట్రాలు, పన్నెండు దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని, ఇది తమ సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులు తమ తమ ప్రాంతాలకు దూరంగా ఉన్నామనే భావన రాకుండా వారి వారి సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిస్తూ పండుగలను జరుపుతున్నామని, ఆ సరస్వతీదేవి విద్యార్థులందరికి మంచి బుద్ది, వాక్కు, వివేకం, విజ్ఞానం ప్రసాదించాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







