సచివాలయ సిబ్బందిపై జేసీ ఆగ్రహం

UPDATED 1st DECEMBER 2020 TUESDAY 8:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్): సచివాలయ పరిపాలన వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. మంగళవారం స్థానిక బళ్ళ మార్కెట్ వద్ద ఉన్న 8,10 వార్డుల్లో ఉన్న సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సిబ్బంది హాజరుపట్టిని పరిశీలించారు. సచివాలయ అడ్మిన్ పై అధికారి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుపట్టిలో గైర్హాజరు అయిన అడ్మిన్ కు మరో సిబ్బంది సాధారణ సెలవు నమోదు చేయడాన్ని ఆయన గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ హాజరు ఎందుకు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ సెలవు నమోదు చేసిన సిబ్బంది పైన, గైర్హాజరు అయిన అడ్మిన్ పైనా  క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ఏసుబాబును ఆదేశించారు. అనంతరం వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో ప్రదర్శించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను పరిశీలించి ఇప్పటి వరకు ప్రజల నుంచి సచివాలయానికి వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారానికి సంబంధించిన డేటాను డిజిటల్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని, లేకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డు సచివాలయాలను తరచూ తనిఖీ చేయాలని మున్సిపల్ కమీషనరును ఆదేశించారు. అలాగే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లలో భాగంగా ఈ నెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధంగా ఉండాలని తహసీల్దార్ జితేంద్రను ఆదేశించారు. దీనిలో భాగంగా జి.రాగంపేట వెళ్లే రహదారిలో ఉన్న ఇళ్ల స్థలాల్ని జేసీ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముందు సామర్లకోట రైల్వే స్టేషన్లో గూడ్స్ గోడౌన్ లో గూడ్స్ రైళ్ల ద్వారా వచ్చిన రేషన్ బియ్యాన్ని పరిశీలించి సివిల్ సప్లై డిఎంఈ లక్ష్మీరెడ్డికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈఈ సిహెచ్ రామారావు, తదితరులు ఉన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us