హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ మాస్టర్(72) ఇక లేరు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన నృత్యాలు సమకూర్చారు. అత్యధికంగా దక్షిణాది భాషా చిత్రాలకు పనిచేశారు. 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి ‘ఆలయ్’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్ మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. బుల్లితెర పైనా తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ప్రస్తుతం టాప్ నృత్య దర్శకులుగా కొనసాగుతున్నారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే. శివశంకర్ మాస్టర్‌కు మెరుగైన వైద్యం అందించడానికి సోనూసూద్, ధనుష్, చిరంజీవిలు తమవంతు సాయం చేశారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు. ఆయన ఇక లేరన్న వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశంకర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు.







