UPDATED 24th JULY 2017 MONDAY 5:00 AM
అన్నవరం : అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి 127వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేటినుంచి మూడు రోజులు పాటు జరగనున్నాయి. ఈనెల 25న స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటిరోజు (24న సోమవారం) ఉదయం 9గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, దీక్షా వస్త్రధారణ, కలశస్థాపన, సాయంత్రం 4 గంటలకు మంటపారాధన, అగ్ని బంధనము, హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 25న (మంగళవారం) స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచి పూజలు ప్రారంభమవుతాయి. 2.30 గంటలకు మహన్యాసం, 4 గంటలకు అభిషేకం, ఉదయం 8 గంటలకు జపములు, 9 గంటలకు ఆయుష్యహోమం, 11.30 గంటలకు పండిత సత్కారము, శ్రీస్వామివారి ప్రాకారసేవ, రథోత్సవం, రాత్రి 7 గంటలకు కొండదిగువన గరుడ వాహనసేవ తదితర కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల చివరి రోజు 26న తెల్లవారుజామున 4గంటలకు అభిషేకము, 8 గంటలకు జపాలు, 9 గంటలకు ఆయుష్యహోమం, 11 గంటలకు పూర్ణాహుతి తదితరాలు చేసి ఉత్సవాలను ముగిస్తారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దేవస్థాన అధికారులు, వైదిక కమిటీతో ఇన్‌ఛార్జి ఈవో ఈరంకి జగన్నాథరావు చర్చించారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.







