మహానుభావుల జీవితాలు మనకు ఆదర్శం

UPDATED 23rd MAY 2017 TUESDAY 11:00 AM

కాకినాడ : భూదానోద్యమానికి  శ్రీకారం చుట్టిన ఆచార్య వినోభాభావే, సేవకు ప్రతిరూపం మదర్‌ థెరిస్సా, అన్నదాత సర్‌ ఆర్థర్‌ కాటన్‌, స్ఫూర్తిమంతుడు వివేకానందుడు, సేవకురాలు నైటింగేల్‌, ఆకలితీర్చే డొక్కా సీతమ్మ, దార్శనీకురాలు సుబ్బులక్ష్మి, లతామంగేష్కర్ వంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  విద్యార్థులకు సూచించారు. కాకినాడ అచ్చంపేటలో గోశాల ప్రాంగణంలో జరుగుతున్న వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు కార్యక్రమంలో ఆయన పలు అంశాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలిపారు. వంద మార్కులొస్తేనే మీ పిల్లాడు గొప్పవాడిగా లెక్కలేసుకోవద్దు.. అబద్ధం ఆడడు, నిజాయతీగా ఉంటాడు, ప్రణాళికతో పనిచేస్తాడు, ఆపదలో అందర్నీ ఆదుకుంటాడు... ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తిని మా అబ్బాయని తల్లిదండ్రులు గర్వపడాలి. చదివే పాఠశాలలో, పనిచేసే కార్యాలయంలో, సమాజంలో కలిసినవాడే నిజమైన మనిషి. మనతోటి విద్యార్థి కూడా వృద్ధిలోకి రావాలి, ఇతరులపై అసూయ పడకూడదు, మనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థి కష్టాన్ని గుర్తించి గౌరవించాలి. ప్రతి కార్యక్రమాన్ని నేను మాత్రమే చేయగలననే గర్వం ఉండకూడదు. అందరితో కలిసి పనిచేస్తేనే విజయాలు సొంతమవుతాయన్నారు. నువ్వు చదువుకొని నువ్వు ఒక్కడివే గొప్ప ఇంజనీరో, డాక్టరువో అవ్వాలనుకోవటం గొప్పకాదు.. నీతోపాటు పదిమందిని వృద్ధిలోకి తీసుకురావటం, పదిమందికి ఉపాధి కల్పించటం నేర్చుకోవాలి. మనుషులనే కాదు.. నీతోపాటు సమాజంలో జీవిస్తున్న చెట్లుకు నీరుపోయటం, జంతువులకు, పక్షులకు ఆహారం పెట్టటంలో ఉన్న ఆనందం మరెందులోనూ రాదు. పి.గన్నవరానికి చెందిన డొక్కా సీతమ్మ అర్ధరాత్రైనా ఆకలితో వచ్చేవారికి అన్నంపెట్టే సహృదయం కలిగిన గొప్ప వ్యక్తి. ఇప్పటికీ పి.గన్నవరంలో ఆమె గృహం ఉంది. అటువంటి సీతమ్మల నుంచి మీరెంతో నేర్చుకోవాలి. ఖాళీ సమయంలో సినిమాకు, షికార్లకు తీసుకెళ్లమనటం కాదు..డొక్కా సీతమ్మ జీవించినటువంటి ఇంటికి తీసుకెళ్లమని మీ తల్లిదండ్రులను అడగండి. వారు తీసుకెళ్లకపోతే వచ్చే ఏడాది మేనమామగా నేను తీసుకెళతాను. ఈ ఇద్దరినీ ఎప్పటికీ గుర్తుంచుకోండి: మనం స్వాతంత్య్ర ఫలాలను ఆస్వాదించడానికి కారణం ఇద్దరే ఇద్దరు. వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఒకరు దేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టిన పోరాట యోధులు, మరొకరు ఎముకలు కొరికే చలిలో రేయింబవళ్లు కష్టపడి దేశాన్ని కాపాడుతున్న వీరజవానులు.
 
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us