ప్రకాశం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021 : ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైసీపీలో కొందరి తీరుపై సుబ్బారావు గుప్తా విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఆయనపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతనే విమర్శించాడని వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. వైసీపీ నేతల వైఖరిని విమర్శించిన సుబ్బారావు గుప్తా ఇంటిపై మొన్న రాత్రి వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దాడి అనంతరం తప్పించుకొని వెళ్లిన సుబ్బారావు.. గంటూరులోని లాడ్జిలో దాక్కున్నాడు. అతని సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త సుభాని, మరికొందరు పార్టీ శ్రేణులు.. మంత్రి బాలినేనినే విమర్శిస్తావా అంటూ లాడ్జికి వెళ్లి సుబ్బారావును కొట్టాడు. ఎవరు చెబితే విమర్శలు చేశావని ప్రశ్నిస్తూనే కొట్టారు. అంతటితో ఆకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి, క్షమాపణ చెప్పించి వీడియో తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దాడులు చేయడం మా సంస్కృతి కాదు: బాలినేని
వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనపై మంత్రి బాలినేని స్పందిస్తూ.. ‘‘గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి మావాళ్లను ఆగమని చెప్పాను. నా గురించి ఒంగోలు ప్రజలకు తెలుసు. దాడులు చేయడం మా సంస్కృతి కాదు. మతిస్థిమితం లేకే గుప్తా సభలో అలా మాట్లాడారు. సుబ్బారావు గుప్తాను కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపా. ఒంగోలులో టీడీపీ నేతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముతుంటారు. గుప్తాకు నాతో ఎక్కువ పరిచయం ఉన్న మాట వాస్తవమే’’ అని మంత్రి వివరించారు.







