ఉండూరు -అచ్చంపేట రోడ్డుకు రూ. ఐదు కోట్ల నిధులు మంజూరు

UPDATED 2nd JUNE 2018 SATURDAY 7:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం ఉండూరు-అచ్చం పేట జంక్షన్ రోడ్డు పనులకు రూ. ఐదు కోట్లు మంజూరు అయినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఉండూరు గ్రామంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ఉండూరు గ్రామం నుంచి సామర్లకోటకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన జూన్ రెండవ తేదీ నుంచి ప్రతియేటా నవ నిర్మాణ దీక్ష రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, విభజన వలన జరిగిన నష్టాల మూలంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం కాకుండా ప్రజా సమస్యల పరిష్కార దిశలో నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నామన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు. గోదావరిపై చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం నీటి ప్రోజెక్ట్ మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, రాష్ట్రంలో పేదలకు గృహ వసతి కల్పించడం కోసం 19లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నామని అన్నారు. ఉండూరు గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో సామాజిక భవనం నిర్మాణం జరుగుతుందని, రూ. 90 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని గ్రామస్థాయి, మన్సిపల్ వార్డు స్థాయిలో వారం రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ప్రతీరోజు వివిధ అంశాలపై మేధావులు, నిపుణులతో చర్చలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉండూరు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం సోలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ కలిగి ఉందని, ఈ గ్రామం భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కళాప్రదర్శనలు, పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు(శ్రీనుబాబు), జెడ్పిటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు కె. సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు కె. వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us