UPDATED 27th MAY 2017 SATURDAY 7:00 PM
విశాఖపట్టణం: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరుగుతున్న మహానాడులో ఆయన శనివారం మాట్లాడారు. వివిధ రంగాల్లో ఏపీకి 45 అవార్డులు వచ్చాయని తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో వెనకబడి ఉన్నామని, మరోవైపు ఆర్థికలోటు ఉన్నప్పటికీ. రూ.24 వేలకోట్ల రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర రాకపోతే బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు రూ.1000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. అలాగే పేద విద్యార్థుల విదేశీ విద్యకు సాయం అందిస్తున్నామని, మహానాడు వేదికగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉపాధి నిధులతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నామన్నారు. భారీగా సేద్యపు నీటికుంటలు తవ్విస్తున్నామని, గ్రామ గ్రామానికి సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. అదేవిధంగా ఏపికి అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయని, భాగస్వామ్య సదస్సులో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. నిరుద్యోగ భృతి కోసం ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా 15 కార్పొరేషన్లలో ఎన్టీఆర్ క్యాంటీన్లు పెడతామని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. టెక్నాలజీతో అవినీతికి అడ్డుకట్ట వేయగలిగామన్న సిఎం పేదవాళ్లు పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఏటా ఇస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పిపిపి పద్ధతిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. బిసి సబ్‌ప్లాన్ తెచ్చిన ఘనత టిడిపిదేనని, బిసిలు మొదటి నుంచి టిడిపికి అండగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఎస్సీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. మంజునాథ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిందని, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామన్నారు. ఆర్థిక సంస్కరణ వల్లే చైనా అభివృద్ధి సాధించిందన్న చంద్రబాబు ఆ రకమైన సంస్కరణల దిశగా ముందుకెళ్తున్నామన్నారు. అంతేకాకుండా సంస్కరణల అంతిమ ఫలితాలు పేదలకు అందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని సిఎం వెల్లడించారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ ధర బాగా తగ్గిందని, దేశంలో 18 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఏపీలోనే నాలుగు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ఏ ఊరిలో తయారు చేసే కరెంట్ ఆ ఊరిలోనే వాడుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. పిడుగుల గురించి ముందే హెచ్చరించే టెక్నాలజీ తీసుకొచ్చామన్నారు.







