UPDATED 6th JANUARY 2018 SATURDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఓ.డి.ఎఫ్ సర్వే నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలను గ్రామంలో నిర్వహించే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అధికారులకు అందచేశారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ జె.ఎన్.టి.యూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.ఎస్.ఎస్.కుమార్ హాజరై మాట్లాడారు. ఆదిత్య విద్యా సంస్థలకు చెందిన ఎన్.ఎస్.ఎస్. టీములు పరిసర గ్రామాలలో సామాజిక కార్యక్రమాలు, అవగాహనా సదస్సులు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపడం అభినందనీయమన్నారు. విద్యా సముపార్జనే ధ్యేయంగా ఉన్నత చదువులు చదివి విద్యార్థులు అత్యున్నతస్థాయికి చేరుకొని గ్రామానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.







