UPDATED 31st JULY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట; విధి నిర్వహణలో అలసత్వం వహించే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఎం.ఎస్.వో విశ్వేశ్వరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. రేషన్ డీలర్లు కార్డుదారుని సమక్షంలో సరుకులను ఈపోస్ యంత్రాలు సహాయంతో తూకం వేయాలని, సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ కార్డుదారునికి తనకు అందే సరుకులు వివరాలు గురించి తెలియపరచాలని, ఈ నెల నుంచి కందిపప్పు, గోధుమలు, పంచదార, వంటనూనె కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రేషన్ డీలర్లకు సరఫరా చేసే రేషన్ సరుకులలో నాణ్యత లోపిస్తే ఆ సరుకులను పంపిణీ చేయరాదని, రేషన్ సరుకులలో నాణ్యత లోపిస్తే తిరిగి ఎం.ఎల్.ఎస్ పాయింట్ పంపాలని, కార్డుదారులకు పంపిణీ చేయరాదని అన్నారు. ప్రతీ రేషన్ కార్డుదారునికి నెలాఖరు వరకు రేషన్ సరుకులు అందచేయాలని, రేషన్ షాపులలో ఆహార సరుకుల పట్టిక ప్రదర్శించాలని, ప్రతీ సరుకులకు రశీదు ఇవ్వాలన్నారు. వేలిముద్ర సమస్య వస్తే 1100కు డీలరే ఫోన్ చేసి సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.







