Kakinada SP: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి

▪️ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు
▪️ పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు 

UPDATED 12th JULY 2022 TUESDAY 10:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్ ) : లాంగ్ పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాధ్ బాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.

ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది పనితీరు, డ్యూటీల నియామకం, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, లాకప్ తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేసారు. స్టేషన్లో నమోదైన వివిధ కేసులలో సీజ్ చేసిన క్రైమ్ ప్రోపెర్టీని ప్రత్యక్షంగా పరిశీలించి వాటి సక్రమ నిర్వహణ, రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చట్టపరంగా ఉన్న ప్రొసీజర్ ను పాటిస్తూ న్యాయస్థానాల ద్వారా సంబంధిత వ్యక్తులకు అందజేయాలని ఆదేశించారు. మహిళలు, ఇతర ముఖ్యమైన కేసులను విశ్లేషించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేకూరేలా కృషి చేయాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు, ఇతర ప్రాధాన్యత అంశాలపై డీఎస్పీతో చర్చించి, స్టేషన్ లో అందుబాటులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద తీవ్రత అధికంగా ఉన్నందున పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎం. వెంకటేశ్వరావు, పెద్దాపురం డిఎస్పీ బి. అప్పారావు, సిఐ ఎస్.కె. అబ్దుల్ నబీ , ఎస్ఐ రావూరి మురళీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.    

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us