విజయవాడ (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరిగే విషయాలు షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సబబో ఆలోచించాలన్నారు. ‘‘అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన అంశంపై తూతూ మంత్రంగా విచారణ కమిషన్ వేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి. పోలవరానికి నిధులివ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంచనాలు పెంచారని తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించిన ముఖ్యమంత్రి జగన్.. అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు? పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం ప్రకారమే నిధులు విడుదలవుతాయి. స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఏపీలోని డెయిరీలు, చక్కెర మిల్లులను మూసేయడాన్ని ఏమనాలి? చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విస్తృతమైంది. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు భాజపా మద్దతిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని తక్షణం అమలు చేయాలి. ఉద్యోగులను అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు’’ అని సోము వీర్రాజు ఆరోపించారు.







