చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి

UPDATED 1ST AUGUST 2017 TUESDAY 5:00 PM

పెద్దాపురం/సామర్లకోట/కాకినాడ : పిల్లల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మీజిల్స్ రూబెల్లా వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన మీజిల్స్ రూబెల్లా వాక్సినేషన్ కార్యక్రమాన్నిఆయన పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలందరికీ టీకా వేస్తున్నట్లు తెలిపారు. టీకా ప్రయోజనాన్ని అందిపుచ్చుకునేలా తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు. పలు ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం టీకాల సాయంతో పోలియోను అదుపు చేయగల్గిందన్నారు. ఎంఆర్‌ టీకాతో పిల్లల్లో విరేచనాలు, బ్రెయిన్‌ హెమరేజ్‌, అంధత్వం తదితర వ్యాధులను నివారించవచ్చన్నారు. పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటూ భావిభారత నిర్మాణానికి కీలకం కావాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8 వరకు అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టీకా వేస్తున్నామన్నారు. జిల్లాలో 11,85,534 మంది పిల్లలకు టీకాలు వేసేందుకు 11,226 కేంద్రాలనూ, 1,34,949 డోసులను సిద్ధం చేసినట్టు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌ బాదం సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వ్యాధినిరోధక టీకాలకు రూ.600 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. తొలుత కర్ణాటకలోనూ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో టీకాల కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.చంద్రయ్య మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఒకటి నుంచి 4 వరకు, 5 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో బాలలకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ  కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ ఎన్‌.రాజేశ్వరి, డీపీఎంవో డాక్టర్ కె .కేశవ ప్రసాద్‌, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారు బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్య భాస్కర్, కౌన్సిలర్లు డాక్టర్ తాళాబత్తుల సాయి, ఎ.నాగమణి, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి , వైద్యులు డాక్టర్ రాజు, సుదీప్తి, మలేరియా డిపార్ట్ మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు మన్యం పద్మావతి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, మున్సిపల్ కమిషనర్ సోమేశ్వరరావు, కౌన్సిల్లర్లు మట్లపల్లి లక్ష్మి, మన్యం చంద్రరావు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినీ   విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us