UPDATED 13th JULY 2017 THURSDAY 8:00 PM
కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గురువారం వివిధ జిల్లాలకు చెందిన కాపు సంఘాల నాయకులు కలిసి చలో అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లాలోని రాజోలు, అమలాపురం, పి.గన్నవరం, రావులపాలెం, రాజానగరం, గాధరాడ, ధర్మవరం, దివిలి, అలాగే విశాఖ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కాపు సంఘాల నాయకులు కిర్లంపూడిలో ముద్రగడను కలిసి మాట్లాడారు. ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టనున్న చలో అమరావతి పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని, ఈ సమయంలో కాపులు రిజర్వేషన్లు సాధించుకోలేకపోతే మరే సమయంలోనూ రిజర్వేషన్లు రావన్నారు. కాపులంతా రిజర్వేషన్ల సాధనకోసం సంఘటితంగా ముందుకు నడుస్తామని విశాఖ జిల్లాకు చెందిన కాపుసంఘం అధ్యక్షుడు తోట రాజీవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు సద్భావనా సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి, గోపు అచ్చుతరామయ్య, మలకల చంటిబాబు, తూము చిన్నబాబు, చల్లా సత్యనారాయణ, ఆడారి బాబ్జి, గణేశుల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







