Digital Arrest : డిజిటల్ అరెస్ట్‌తో రూ. 10 కోట్లు దోపిడీ

UPDATED 30th SEPTEMBER 2026 12:00 PM

  • విశ్రాంత ఇంజనీర్‌ను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
  • ​విజయవాడలో వెలుగు చూసిన సంచలన మోసం

విజయవాడ, రెడ్ బీ న్యూస్, సెప్టెంబర్ 30 : విజయవాడకు చెందిన 80 ఏళ్ల ఓ రిటైర్డ్ ఇంజనీర్‌‌ను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించి ఏకంగా రూ. 10 కోట్లు లాగేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుడు సకాలంలో పోలీసులను ఆశ్రయించడంతో, అధికారులు స్పందించి అందులో రూ. 7 కోట్లు రికవరీ చేయగలిగారు.

​ఉగ్రవాద ఖాతాలంటూ నకిలీ బెదిరింపులు

​కృష్ణలంక ప్రాంతానికి చెందిన బాధితుడు విదేశాల్లో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన సైబర్ నేరగాళ్లు ఆయనకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేశారు. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, ఆయన పేరు మీద ముంబైలో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఉగ్రవాద సంస్థలకు వెళ్లాయని, దీనిపై కేసు నమోదు చేశామని బెదిరించారు. ఫోన్లో మాట్లాడిన వారంతా పోలీసు దుస్తుల్లో ఉండడంతో బాధితుడు అది నిజమేనని నమ్మి భయాందోళనకు గురయ్యారు.

​విడతలవారీగా రూ. 10 కోట్లు బదిలీ

​కేసు నుంచి విముక్తి కలగాలంటే తమకు రూ. 5 కోట్లు ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో భయపడిపోయిన బాధితుడు పీఎన్‌బీలో ఉన్న తన డిపాజిట్‌ను రద్దు చేసి ఆర్టీజీఎస్ ద్వారా రూ. 5.25 కోట్లను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత మంగళవారం నాడు సైబర్ కేటుగాళ్లు మళ్లీ ఫోన్ చేసి మరో రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, బాధితుడు ఆ మొత్తాన్ని కూడా వారి ఖాతాకు పంపారు.

​కుమారుడి చొరవతో పోలీసుల రంగప్రవేశం

​కాసేపటికి నేరగాళ్లు మరింత డబ్బు కావాలని మళ్లీ డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి, బాధితుడు జరిగిన విషయాన్ని తన కుమారుడికి చెప్పారు. ఆయన వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

​స్పందించిన పోలీసులు.. రూ. 7 కోట్లు రికవరీ

​పోలీసులు క్షణాల్లో సాంకేతికంగా విశ్లేషించి, ఆ డబ్బు జమ అయిన ఖాతాలను తక్షణమే స్తంభింపజేయాలని బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసుల సమయస్ఫూర్తి, బ్యాంకు సిబ్బంది సహకారంతో మొత్తం రూ. 7 కోట్లను సురక్షితంగా రికవరీ చేయగలిగారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us