పోర్టౌ ప్రిన్స్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: కరీబియన్ ద్వీప దేశం హైతీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలి 50మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ వెల్లడించారు. ‘సంఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనాన్ని చూశాను’ అని పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు. పేలుడు కారణంగా సంభవించిన మంటలు అంటుకొని దాదాపు 20 ఇళ్లు కూడా కాలిపోయినట్లు తెలిపారు. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇళ్లల్లో చిక్కుకుపోయి మరణించినవారితో కలిపి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.







