* ఏప్రిల్ 14 నుంచి 25 వరకూ 12 రోజుల పాటు నిర్వహణ
* 26న పుత్రకామేష్టి యాగం
* 27న ప్రత్యంగిరా హోమం
* తరలిరానున్న పీఠాధిపతులు
* లక్షలాదిగా హాజరుకానున్న అశేష భక్తజనం
* పెద్దాపురం చేరుకున్న యజమాని, పత్ని, ఋత్విక్కులు
* ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
* చరిత్రపుటల్లో నిలవనున్న పెద్దాపురం పట్టణం
UPDATED 13th APRIL 2018 FRIDAY 9:00 PM
పెద్దాపురం: నప్త సోమయాగాల్లో అత్యంత ఉత్కృష్టమైనదిగా భావించే అతిరాత్ర ఉత్కృష్ట శ్రౌత సోమయాగ క్రతువుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక పాండవులమెట్ట సమీపంలో జరిగే యాగ ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఇంతవరకు కేరళ రాష్ట్రానికి పరిమితమైన ఈ మహాయజ్ఞం ఇక్కడ జరగడంపై ప్రజల్లో సర్వత్రా అసక్తి నెలకొంది. యాగకర్త కేశాప్రగడ హరిహరనాథశర్మ పర్యవేక్షణలో ఈ మహాయాగాన్ని నిర్వహించనున్నారు. అతిరాత్రం నాలుగు వేల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన వైదిక యాగం. భారతీయ సంస్కృతికి ప్రమాణాలుగా భావించే చతుర్వేదాలలో పేర్కొనబడిన అతి ప్రాచీనమైన యజ్ఞం అతిరాత్రం. ఎంతో విశిష్టమైన మహోన్నతమైన అతిరాత్ర యాగాన్ని పెద్దాపురం పట్టణంలో పాండవులు నడయాడిన ప్రాంతంలో నిర్వహిస్తుండడం విశేషం. ఈనెల 14 నుంచి ఏప్రియల్ 25 వరకూ 12 రోజులపాటు యాగకర్త కేశాప్రగడ హరిహరనాథశర్మ పర్యవేక్షణలో నిర్వహించే అతిరాత్ర ఉత్కృష్ట శ్రౌత సోమయాగ క్రతువుకు అన్ని ఏర్పాట్లు చేశారు. యాగాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో భక్తులు, పర్యాటకులు, పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్తలు తరలిరానున్నారు.
లోక కల్యాణం కోసమే అతిరాత్రం
సమస్త జీవరాశుల యోగక్షేమాలను ఆకాంక్షిస్తూ విశ్వశాంతి కోసం, సకల చరాచర జీవరాశికి మేలు కలగాలన్న ఏకైక లక్ష్యంతో ఈ అతిరాత్ర యాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో గల సమస్త జీవరాశుల్లో మానవుడు తప్ప ప్రతి జీవి సృష్టి ధర్మానుసారంగా జీవిస్తాయి. మానవుడు మాత్రం ప్రకృతిని శోధించి, చేధించి ప్రకృతి సంపదను వాతావరణాన్ని కలుషితం చేసి ప్రకృతి వినాశనానికి కారకుడవుతున్నాడు. అందుకే వేదం ఏది హితమో, ఏది వినాశకరమో మనకు తెలియచేస్తుంది. మానవత్వం అనగా నాకు మరో జన్మ వద్దనే విచక్షణ కలిగిన జన్మ. ఈ జన్మలో సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది సకల ప్రాణికోటికి సేవ చేస్తూ ప్రకృతిని సంరక్షించి సత్ ప్రవర్తనతో ధర్మాన్ని ఆచరించడం ప్రధానం. ప్రకృతి సంరక్షణ, తల్లిదండ్రుల సేవ, అన్నదానం, ప్రాణికోటికి ఆహారాదులు కల్పించడం ద్వారా స్వగృహ సంస్కారవంతుడై, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా శాంతి, సౌభాగ్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యమయ జీవితం పొంది మానవుడు స్వదేశ సంస్కారం పొందుతాడని శాస్త్రాల్లో పేర్కొన్నారు.
నవ్యాంధ్రకు దక్కిన ఖ్యాతి
ఇప్పటివరకూ కేరళ రాష్ట్రానికి పరిమితమైన ఈ అతిరాత్రం నవ్యాంధ్రలో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో నిర్వహిస్తుండడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇటువంటి అరుదైన యాగాన్ని ఇక్కడ నిర్వహించడానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అతిరాత్ర యాగం నిర్వహించాలంటే నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో కనీసం ఏఒక్కటి ఉన్నా యాగం నిర్వహించేందుకు వీలుంటుంది. యాగస్థలికి 24 కిలోమీటర్ల దూరంలో తూర్పున సముద్ర తీరం, పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరం మధ్యలో పెద్దాపురం పట్టణం ఉండడం, అలాగే పంచారామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్యరామ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, అలాగే రాజసూయ యాగంతో పాటు ఎన్నో సోమయాగాలు ఆచరించిన పాండవులు నడయాడిన ప్రాంతం కావడంతో యాగ నిర్వహణకు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. దశరథ మహారాజు ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడు అతిరాత్ర యాగం నిర్వహించారన్న ప్రస్తావన రామాయణంలోని బాలకాండ, యుద్ధకాండల్లో ఉంది. దశరధ మహారాజు చేసిన అశ్వమేథయాగ ప్రక్రియలో భాగంగా చివరి రోజు అతిరాత్రం నిర్వహించినట్లు రామాయణంలోని బాలకాండంలో 14వ సర్గలో 39, 40 శ్లోకాల్లో ఉంది. అలాగే రామాయణ యుద్ధకాండలో 151వ సర్గలో 88వ శ్లోకం నుంచి 92 వ శ్లోకం వరకు ఈ యాగ ప్రస్తావన ఉంది.







