ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి వచ్చే మూడేళ్లలో టోల్ ఆదాయం భారీగా పెరగనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 40వేల కోట్ల మేర టోల్ రూపంలో ఆదాయం వస్తుందని.. మూడేళ్ల తర్వాత అది ₹1.40లక్షల కోట్లుగా ఉండనుందన్నారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏటా ట్రాఫిక్ సాంద్రత పెరుగుతున్నందున భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడిదారులకు భారీ అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐకి టోల్ ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి ₹40వేల కోట్లుగా ఉందని, ఇది వచ్చే మూడేళ్లలో 1.40లక్షలకు పెరుగుతుందని పునరుద్ఘాటించారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ఆహ్వానించిన గడ్కరీ.. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతోందన్నారు. అందువల్ల సహజంగానే, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అంతర్గతంగా రాబడి రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పారు.







