UPDATED 15TH MAY 2017 MONDAY 8:00 PM
కాకినాడ : రానున్న అయిదు రోజుల్లో 42 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. సోమవారం రాత్రి ఆయన బులిటెన్ విడుదల చేశారు. హైదరాబాద్ వాతావారణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు వీస్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకూ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ బయటకు వెళ్లవద్దని, ఇళ్లు, కార్యాలయాల్లోనే ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయడం మంచిదని సూచించారు. బయటకు వెళ్లేవారు సాధ్యమైనంత వరకూ నీడనిచ్చే చెట్లు, ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. వేడిగాలులు తీవ్రత అధికంగా ఉంటుందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఉదయం 6 నుంచి 11.30 గంటలోపు ముగించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. చలివేంద్రాలు నిర్వహణ సక్రమంగా ఉండాలని, వీటిని మరిన్ని పెంచాలని సూచించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.







