UPDATED 25th FEBRUARY 2022 FRIDAY 04:50 PM
Chandrababu Ukraine : యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అక్కడి తెలుగు విద్యార్థులతో చంద్రబాబు జూమ్ లో సమావేశం అయ్యారు. తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు విద్యార్థులంతా ఐక్యంగా ఉండటంతో పాటు తటస్థంగా ఉండటం ఎంతో మంచిదన్నారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకం అని చెప్పారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని వారి సూచించారు చంద్రబాబు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు వారితో చెప్పారు.
రాబోయే 2-3 రోజులు ఎంతో కీలకం అన్న చంద్రబాబు.. పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీరు ఎవరికీ లక్ష్యం కాదు కాబట్టి మీరు సురక్షితంగా ఉండొచ్చని చంద్రబాబు వారితో అన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి మీ యోగక్షేమాల కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు చంద్రబాబు.







