స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి

* అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి

UPDATED 31st MAY 2020 SUNDAY 6:00 PM

పెదపూడి(రెడ్ బీ న్యూస్): ప్రజలు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పెదపూడి మండలం  జి. మామిడాడ గ్రామంలో స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డితో కలిసి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జి. మామిడాడకు సంబంధించి మొదటి పాజిటివ్ కేసుగా నమోదయిన వ్యక్తి కొంత నిర్లక్ష్యం వహించడం వలన కేసుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా లయన్స్ క్లబ్ సహాయంతో ప్రతీ ఒక్కరికి నిత్యవసర సరుకులు, బియ్యం అందేలా చేయడం జరుగుతుందన్నారు. జి.మామిడాడకు సంబంధించి సుమారు ఐదు వేల మందికి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. కుటుంబం లేదా చుట్టుపక్కల ఎవరికైనా పాజిటివ్ వచ్చినా భయాందోళనకు గురికావద్దన్నారు. జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 21వ తేదీ తర్వాత కోవిడ్ -19 కేసుల సంఖ్య బాగా పెరిగిందని, ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించి ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కంట్రోల్ సెంటర్ లో రెవెన్యూ, వైద్య, శానిటేషన్, సివిల్ సప్లై,ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. జి.మామిడాడ ప్రాంత ప్రజలకు సంబంధించి వైద్య సదుపాయం నిమిత్తం ఇక్కడ ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు. శానిటేషన్ కు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరిగిందన్నారు. కేసుల సంఖ్య తగ్గేంతవరకు ఇక్కడే పర్మినెంట్ గా శాంపిల్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామస్థులకు చింతా దొరబాబు యువజన సంఘం, గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు సమకూర్చిన నిత్యావసర వస్తువులైన ఐదు కేజీల బియ్యం ప్యాకెట్లను కలెక్టరు ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-3 కీర్తి చేకూరి, కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు   

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us