రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 3 నవంబరు 2021: రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో గతనెల 31న రాత్రి డాక్టర్ రామ్మోహనరావు ఇంట్లో ముగ్గురు గుర్తుతెలియని దొంగలు పడి దోపిడీ చేసిన కేసును అర్బన్ జిల్లా పోలీసులు కేవలం 72 గంటల్లో ఛేదించారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తే తన స్నేహితులతో కలిసి ఈ చోరీ స్కెచ్ వేశాడు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుఽధవారం సాయంత్రం అడిషనల్ ఎస్పీ లతామాధురి వివరాలు వెల్లడించారు. డాక్టర్ రామ్మోహనరావు ఇంట్లోకి ప్రవేశించి అతని భార్య నిద్రించేందుకు ఉపక్రమిస్తున్న తరుణంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగు కప్పి బీరువా తాళాలు అడిగి తీసుకుని అందులో రూ.15 లక్షలు నగదు, 376 గ్రాముల బంగారు వస్తువులు అపహరించుకుపోయారని తెలిపారు. ఈ కేసును ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్ డీఎస్పీ ఏటీవీ రవికుమార్ నేతృత్వంలో సీఐ ఆర్‌జేవీ రవికుమార్, యంవీ సుభాష్, కె.మంగాదేవిలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కేసును దర్యాప్తు చేసి దొంగలను రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆవరోడ్డు వాంబే గృహాల్లో ఉంటున్న కందుకూరి వెంకటేష్, రాజమహేంద్రవరం తాడితోట వీరభద్రనగర్‌కు చెందిన పడమట్ల దుర్గాగణపతి, షేక్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసు కున్నామన్నారు.. వీరిలో కందుకూరి వెంకటేష్ గత 9 నెలలుగా డాక్టర్ ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఈ నేపథ్యంలో తన యజమాని ఇంట్లో చోరీకి పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి తన స్నేహితులిద్దరినీ తీసుకుని ఈ చోరీకి పాల్పడ్డారని ఏఎస్పీ తెలిపారు. నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారని చెప్పారు. వారి వద్ద నుంచి 375 గ్రాములు బంగారం, రూ. 8 లక్షల 40వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసును ఛేదించిన ప్రత్యేక టీమ్‌ను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించారు.







