ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 48 మందికి ఆర్థికసాయం అందజేత
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ అసూయ, ద్వేషాల స్థానంలో ప్రేమను పంచాలని చెప్పారు. తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 48 మంది వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని నారా భువనేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆపద సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సహాయం అందించామన్నారు. సమాజానికి న్యాయం చేయాలని.. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని భువనేశ్వరి చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఆయన వారసత్వాన్ని తమ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తుందన్నారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు.







