దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కన్నుమూత

UPDATED 30th MAY 2017 TUESDAY 10:00 PM

REDBEENEWS: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు (75) కిమ్స్ ఆస్పత్రిలో చిత్సపొందుతూ కన్నుమూశారు. జనవరిలో జరిగిన శస్త్రచికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు లోనైన దాసరి, 4 రోజుల క్రితం మరోసారి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. హైబీపీతో బాధపడుతున్న దాసరికి వైద్యులు చికిత్స కొనసాగిస్తుండగా..దాసరి కన్నుమూశారు. డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంతో సేవ చేశారు. అనంత‌రం రాజ‌కీయాల్లో సైతం త‌న సేవ‌ల‌ను కొన‌సాగించారు. కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు. అత్యధిక చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి గిన్నిస్ రికార్డుకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1947, మే 4న దాస‌రి జన్మించాడు. బీ.ఏ డిగ్రీలో దాసరి పట్టభద్రుడు. కాలేజీ రోజుల్లోనే దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. చాలా త‌క్కువ‌ కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంతో మంది కొత్త కళాకారులను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయం చేశారు. దాస‌రి చేతుల మీదుగా ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన‌వారు చాలా మంది స్టార్‌లుగా ఎదిగారు. దాస‌రికి అభిమానులు కూడా ఎక్కువే. 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. దాస‌రి మొద‌టి తాతామ‌న‌వ‌డు(1972),  స్వ‌ర్గం న‌ర‌కం, మేఘ‌సందేశం, మామగారు సినిమాలు దాస‌రికి మంచి పేరు తెచ్చాయి. విజ‌య‌శాంతితో తీసిన ఒసేయ్ రాముల‌మ్మ అప్ప‌ట్లో ఒక సంచలన చిత్రం గా నిలిచింది. దాస‌రి సినిమాలు స్త్రీ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తీసేవారు. స‌మాజంలోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై సందేశాత్మ‌క చిత్రాల‌కు దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి న‌ర్మించారు. దాస‌రి తీసిన బొబ్బిలి, స‌ర్దార్ పాప‌రాయుడు సినిమాలు ఓ ప్ర‌భంజ‌నం సృష్టించాయి. ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌వేశానికి ఈ సినిమాలు ఎంతోగానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. మామగారు, సూరిగాడు సినిమాలు ఆయ‌న న‌ట‌నా ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. తాతామనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన దాసరి తొలిచిత్రంతోనే సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు. మామగారు, సూరిగాడు, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, మేస్త్రీ, ఎర్రబస్సు లాంటి చిత్రాల్లో నటించారు. మజ్ను, అమ్మరాజీనామా, సూరిగాడు, ఓసేయ్‌రాములమ్మ, ఓరేయ్ రిక్షా, బలిపీఠం, మనుషులంతా ఒక్కటే, తూర్పుపడమర, చిల్లరకొట్టు చిట్టెమ్మ, కటకటాల రుద్రయ్య, గోరింటాకు, శివరంజని, నీడ, రంగూన్ రౌడీ, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు, బొబ్బిలిపులి, మేఘ సందేశం, తాండ్రపాపారాయుడు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా దాసరి చివరి చిత్రం ఎర్రబస్సు. దాసరి ఉత్తమ దర్శకుడిగా రెండు సార్లు ఫిలింఫేర్  అవార్డు అందుకున్నారు. గోరింటాకు (1979), ప్రేమాభిషేకం (1981) చిత్రాలకు దాసరి ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాల్ని సినిమాలతో ఎలుగెత్తి చాటారు. అనేక సందేశాత్మక చిత్రాలను తీసి తెలుగు చలన చిత్ర పరిశ్రమను దాసరి గిన్నీస్‌రికార్డుకు ఎక్కించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో కలిసి ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాలు తీశారు. సినీ చ‌రిత్ర‌లో దాస‌రి నారాయ‌ణ రావు ప్ర‌తిభ‌కు ఎన్నో అవార్డులు ఆయ‌న సొంత‌మ‌య్యయి. 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందారు. 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు. రాజీవ్ గాంధీ కాలంలో దాసరి కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుగ్గా ప‌ని చేశారు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి దూరంగా ఉన్నారు. 1990 దశకం చివరిలో తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. అనంత‌రం మ‌ళ్లీ కాంగ్రెస్‌లో కొన‌సాగారు. రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా ప‌ని చేశారు. ఈయన కాంగ్రెస్  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్  పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక దాస‌రి ప‌త్రికా రంగంలో కూడా అపార‌ అనుభ‌వం గ‌డించారు. 1984లో ఉద‌యం ప‌త్రిక‌ను స్థాపించి చీఫ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. అప్ప‌ట్లో ప‌త్రికా రంగంలో ఉద‌యం సంచ‌ల‌నం సృష్టించింది. 1100 మంది ఉద్యోగుల‌తో దాదాపు 11 సంవ‌త్స‌రాలు ఉద‌యం ప‌త్రిక దిగ్విజ‌యంగా కొన‌సాగింది. 1995 జూన్ 15న ఉద‌యం మూత‌ప‌డింది. దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us