Updated 25 January 2022 Tuesday 11:00 PM
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్): పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, నాదెళ్ల సత్యనారాయణ, పద్మశ్రీకి ఎంపికైన గరికిపాటి నరసింహారావు, దర్శనం మొగిలయ్య, రామ చంద్రయ్య, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, శ్రీమతి పద్మజ రెడ్డి, కీర్తిశేషులు గోసవీడు షేక్ హసన్‌కు న్యాయమూర్తి శ్రీరమణ పేరు పేరునా అభినందనలు తెలిపారు. తెలుగుజాతి కీర్తి పతాకను కోవిడ్ టీకా ఆవిష్కరణతో విశ్వ వినువీథుల్లో ఎగురవేసిన ఎల్లా దంపతులు, అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న నాదెళ్ల సత్యనారాయణ పద్మభూషణ్‌కు ఎంపికవడం ముదావహమన్నారు. చక్కని తెలుగు వాచకంతో, అర్థవంతమైన ప్రవచనాలతో తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన గరికిపాటి నరసింహారావు, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ఇతర పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తెలుగు జాతికి గర్వకారణమని జస్టిస్ రమణ కొనియాడారు.







