Updated 14th March 2023 Tuesday 2:50 pm
Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది. విజయవాడ, ఆటో నగర్, తాడిగడప జంక్షన్, పోలంకి, పెరమలూరు జంక్షన్, పామర్రు, గుడివాడ సెంటర్ మీదుగా ర్యాలీగా మచిలీపట్నం సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే పవన్ కల్యాణ్ డైరీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి కాకుండా విజయవాడ ఆటో నగర్ నుంచి పవన్ కల్యాణ్ ర్యాలీ ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ర్యాలీ ప్రారంభ స్థలం మార్పు చేసినట్లు పేర్కొంది. పోలీసుల విజ్ఞప్తి మేరకు ర్యాలీ ప్రారంభ స్థలాన్ని మార్చినట్లు ప్రకటించింది. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా జరుపుతున్నారు. ఈ సభా వేదికగా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మచిలీపట్నంలో జరుగబోయే జనసేన సభ రాబోయే ఎన్నికలకు దిశా నిర్ధేశం చేయనుంది. అయితే పవన్ ఏం ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.







